ఉపాసనలు - జీవన్ముక్తి ప్రకాశము


7. ఉపాసనలు - జీవన్ముక్తి ప్రకాశము

శ్లో||  అనన్యాశ్చింతయంతో మాం | యే జనాః పర్యుపాతే |
       తేషాం నిత్యాభియుక్తానాం | యోగక్షేమం వహామ్యహమ్‌ ||

తా||    సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన జగద్గురువైన శ్రీకృష్ణుని పరబ్రహ్మమేనని ఉపాసించుచు, అన్య చింతలు లేని యోగికి యోగా రూఢత్వమును, క్షేమకరమైన స్వస్వరూప సాక్షాత్కారమును, ఆ జగద్గురువే సిద్ధింపజేయును.

ఉపాసన : 
ఉపాసన అనగా ఉపాస్య వస్తువు యొక్క లక్షణములను అత్యంత వివరణముగా ఉపాసకుడు తనమీద, తన భావాల మీద, అవసరమైతే అంగాంగములమీద  ఆపాదించుకొనుట. ఫలితముగా ఆ ఉపాస్య వస్తువు తానేయగుట. ఉపాసన, అనుష్ఠానము, న్యాసము ఇవన్నీ కూడా యోగాభ్యాస మందు అంగములే. వీటిలో కొన్ని స్వయముగా గాని, కొన్ని గురూపదేశము ద్వారా గాని చేయుచుందురు.

ఉపాసకులకు ప్రతిబంధకములు :

1. జిష్మము : 
కుటిలత, కాపట్యము, శ్రద్ధ లేకుండుట, లక్ష్యము కొఱకు నిజాయితీతో చేయకుండుట, కేవలము కర్మకాండగా చేయుట.

2. అనృతము : 
అసత్య ప్రవర్తన, శాస్త్రీయముగా చేయకుండుట. గురువు అవసరమున్నను గురువు సూచన లేకుండా తన కిష్టమైనట్లు చేయుట.

3. మాయ : 
అనార్జవము, ఋజువర్తనము అనేవి స్వభావములోనే లేకుండుట, మాయావశుడై, ఆ స్వభావమును మార్చుకొనకుండా ఉపాసించుట.

ప్రణవోపాసన : 
ప్రణవమును అకార ఉకార మకార మాతృకలుగా నున్న ఆ పరబ్రహ్మను ఉపాసించువారు బ్రహ్మలోక ప్రాప్తిని పొందెదరు. తరువాత పరబ్రహ్మానుభూతి బడయుదురు. ఈ త్రిమాత్రా రూపములు అపరమార్థము. త్రిమాత్రలయందు వ్యాపించియున్నది వీటికి ఆధారము. త్రిమాత్రలున్నా, లేకపోయినా ఉంటూనే ఉండేది, ఉన్నప్పుడు ఆధారమని చెప్పబడేదీ, అధిష్ఠాన చేతన రూపము ఒక్కటే. ఈ అధిష్ఠానము త్రిమాత్రలు లేనిది కనుక, దీనికి అమాతృక అని పేరు. ఇది పరమార్థ రూపము. ఇది పరబ్రహ్మము.
         త్రిమాత్రలందున్న అమాతృక అస్తి భాతి ప్రియముగానున్నది. త్రిమాత్రలను చైతన్యవంతమగుటకు ఆధారమై యున్నది. త్రిమాత్రలు నామరూప క్రియలుగా నున్నవి. ఆ త్రిమాత్రాయుత నామరూప క్రియలు మిథ్య. కనుక కేవల అస్తిభాతి ప్రియములే సత్‌ చిత్‌ ఆనందము.
         ఈ అమాతృకను ఆధార పద్ధతిలో ఉపాసన చేయగా పరమాత్మానుభవము కలుగును. ఇది తురీయ జ్ఞానము. అమాతృకను అధిష్ఠాన పద్ధతిగా ఉపాసన చేయగా తానే పరబ్రహ్మ రూపమైన అపరోక్షము సిద్ధించును. మొదటిది అపరబ్రహ్మ జ్ఞానము. రెండవది పరబ్రహ్మ సాక్షాత్కార విజ్ఞానము. ఇది తురీయాతీతము.

అహంగ్రహోపాసన : 
వేద ప్రమాణముననుసరించి, విశ్వాసముతో, బలవంతముగా నేను బ్రహ్మను అని ఎవడు ఎడతెగక ధ్యానము చేయునో, అట్టి ధ్యానమును అహంగ్రహ ధ్యానము అందురు. దీనినే అహంగ్రహో పాసన అని కూడా అందురు. ఈ ధ్యానము అతడిలో జ్ఞానోదయము కలిగించి మోక్షమును ప్రాప్తింపజేయును.

         1. తనను తాను సగుణ బ్రహ్మగా, లేక అపర బ్రహ్మగా చింతన చేయుట వలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగును. అక్కడ సత్వగుణము మాత్రమే ఉండును. అది తన బ్రహ్మానుభవమును స్థిరముగా ఉంచును. రజోతమో గుణములు లేనందున ఏ సాధనతో పని ఉండదు. కొంత కాలమునకు పరోక్షానుభవము క్రమముగా అపరోక్షానుభూతిగా మారును. ఇది క్రమముక్తి.

          2. తనను తాను నిర్గుణ బ్రహ్మగా లేక పరబ్రహ్మగా చింతన చేయగా చేయగా, అపరోక్షానుభూతి సిద్ధించును. కాని నిర్గుణోపాసన కష్టతరము. అందువలన సగుణోపాసన ద్వారా క్రమముక్తి సులభము. ఈ ఉపాసనలు రెండూ కూడా అహంగ్రహోపాసన క్రిందికి వచ్చును.

పంచకోశలయోపాసన :
          వ్యష్ఠి అన్నమయ కోశాభిమానమును నాశనము చేసుకొని సమష్టితో ఐక్యము చేయగా విరాట్‌ రూపమగును.
         వ్యష్ఠి ప్రాణమయ కోశాభిమానమును నాశనము చేసుకొని సమష్టితో ఐక్యము చేయగా క్రియా శక్తియుతమైన సూత్రాత్మ రూపమగును.
          వ్యష్టి మనోమయ కోశాభిమానమును నాశనము చేసుకొని, సమష్టితో ఐక్యము చేయగా సంకల్ప శక్తియుతమైన సూత్రాత్మ రూపమగును.
         వ్యష్టి, విజ్ఞానమయ కోశాభిమానమును నశింప చేసుకొని, సమష్టితో ఐక్యము చేయగా, జ్ఞాన శక్తియుతమైన సూత్రాత్మ లేక అధ్యవసాన శక్తియుతమైన సూత్రాత్మ రూపమగును.
         ఈ విధముగా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాభిమానములు మూడూ నశించగా క్రియా శక్తి, సంకల్పశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడు కలసియున్న హిరణ్యగర్భ రూపమగును.
         వ్యష్ఠి ఆనందమయ కోశాభిమానమును నాశనము చేసుకొని సమష్టితో ఐక్యము చేయగా ఈశ్వర, లేక అవ్యాకృత రూపమగును.
         ఈ విధముగా వ్యష్టిగా నున్న జీవుని పంచీకృత భాగములైన పంచకోశముల అభిమానములు నశించగా, మిగిలియున్న అపంచీకృత సమష్టిగా నున్న ఈశ్వరుని పంచకోశముల రూపమగును.
          ఆనందము కారణముగా విజ్ఞానము, విజ్ఞాన కారణముగా మనస్సు, మనస్సు కారణముగా ప్రాణము, ప్రాణము కారణముగా అన్నము పుట్టి జీవుని పంచకోశములైనవి. తిరుగా ఒక్కొక్క కార్యమును నశింపచేయగా అవి వాటియొక్క కారణములందు క్రమముగా లయమొందును. అనగా అన్నమును ప్రాణములోను, ప్రాణమును మనస్సులోను, మనస్సును విజ్ఞానము (బుద్ధి)లోను, బుద్ధిని ఆనందములోను లయమొనరించుకొనగా ఆనందోబ్రహ్మయగును. అనగా అన్నమే ప్రాణమై, ప్రాణమే మనస్సై, మనస్సే విజ్ఞానమై, విజ్ఞానమే ఆనందమై, ఆనందమే బ్రహ్మమగుచున్నది. ఆ బ్రహ్మమే శేషించి, అద్వయమై నిశ్చలమై యుండును. ఇది పంచకోశలయోపాసన.
         ఇదే విధముగా సమష్టి పంచ కోశములను వాటి వాటి కారణము లందు క్రమముగా లయమొనరించగా విరాట్టు హిరణ్యగర్భునిలోను, హిరణ్యగర్భుడు మహత్తులోను లయము కాగా ఆనందో బ్రహ్మమే శాశ్వతముగా నున్నది.
         ఆనంద బ్రహ్మ కూడా కార్యమేనని తెలిసి, కాని దానికి కారణము లేదనికూడా తెలిసి, శ్రీ సద్గురుమూర్తి అచల పరిపూర్ణ పరబ్రహ్మను జూపి, తనకు తానే తోచిన ఆనందో బ్రహ్మ యనెడి అఖండ ఎరుకను విడిపించును. అనగా మాయాశబలిత బ్రహ్మ మాయమగును. గురువు దర్శింపజేసినదేదో శిష్యునికి అది తానేననెడి అపరోక్షము సిద్ధించును.

హిరణ్యగర్భోపాసన : 
హిరణ్యగర్భుడనగా పరమాత్మనుండి మొట్టమొదట ఆవిర్భవించిన ప్రాణుడు. అదే ప్రథమ జీవత్వము. ఈ ప్రాణునికి కలిగిన జ్ఞానమును బట్టి అతడే పరమాత్మ, బ్రహ్మ, అపరబ్రహ్మ, అతడి బహిఃప్రజ్ఞచేత విరాట్‌ అనియు, అతడి అంతఃప్రజ్ఞచేత హిరణ్యగర్భుడనియు పేరు. ప్రజ్ఞాన ఘనమైనప్పుడు అవ్యాకృతుడు లేక ఈశ్వరుడు అని పేరులు. ఇతడే సమష్టి రూపుడైన సర్వకారణోపాధికుడైన ఆత్మ. ఇతడే పరప్రకృతి రూపుడు.
         పరబ్రహ్మ నిర్విశేషుడై యుండగా హిరణ్యగర్భుడు సవిశేషుడు. సకల ప్రాణులకు ఆత్ముడు. ఈ విధమైన విశేషార్థముతో హిరణ్యగర్భోపాసన చేయవలెను. అట్టి ఉపాసకులు శరీర విసర్జనానంతరము బ్రహ్మలోకమును జేరి బ్రహ్మ జతలో వాసమై యుందురు. అక్కడ ఆ లోక సుఖమును అనుభవించుచుందురు. అక్కడే బ్రహ్మజ్ఞానము ఉదయించుటకు అవకాశమున్నది. అట్టివారు ముక్తులగుదురు. బ్రహ్మజ్ఞానమును బడయని వారు ఆ బ్రహ్మ కల్పములో సుఖించుచు, బ్రహ్మ కల్పానంతరము మరల ఇహలోకములో జన్మించెదరు.
         అందువలన నిర్విశేష బ్రహ్మమైన పరబ్రహ్మ జ్ఞానమును ఇక్కడే, ఇహలోకములోనే సముపార్జించుకొనవలెను. శరీర పతనానంతరము పునరావృతి లేని మోక్షము సిద్ధించును.

విరాట్‌ పురుష వ్యాహృత్యుపాసన :

ఉపాసన పద్ధతి : 
అన్నమునకు సంబంధించిన బ్రహ్మమును భూఃవ్యాహృతియందు అగ్నితోను, భువఃవ్యాహృతియందు వాయువుతోను, సువఃవ్యాహృతియందు సూర్యునితోను, మహఃవ్యాహృతియందు విరాట్‌ బ్రహ్మతోను ఉపాసకుడు ఐక్యానుసంధానమును ధ్యానించవలెను. పిదప సర్వాత్మ భావము పొంది, ఆనంద స్వరూపమైన మనస్సును కలిగి, పరిపూర్ణ శాంతితో నిండినట్టి అమృతత్వమును పొందును.

విరాట్‌ పురుష వ్యాహృత్యుపాసన : ఇది నాలుగు విధములు.

1. లోక వ్యాహృత్యుపాసన : 
భూః అనగా భూలోకము, భువః అనగా అంతరిక్ష లోకము, సువః అనగా స్వర్గ లోకము. మహః అనగా ఆదిత్య లోకము. పైన చెప్పిన పద్ధతిలో 4 వ్యాహృతులను 4 లోకములుగా ఉపాసన చేయవలెను.

2. జ్యోతివ్యాహృత్యుపాసన : 
భూః అనగా అగ్ని, భువః అనగా వాయువు, సువః అనగా ఆదిత్యుడు, మహః అనగా చంద్రుడు. అదే పద్ధతిలో 4 వ్యాహృతులను 4 జ్యోతులుగా ఉపాసన చేయవలెను.

3. వేదవ్యాహృత్యుపాసన : 
భూః అనగా ఋక్కులు, భువః అనగా సామములు, సువః అనగా యజుస్సులు, మహః అనగా ఓంకారము. 4  వ్యాహృతులను 4 వేదములుగా పై పద్ధతి ప్రకారము ఉపాసన చేయవలెను.

4. ప్రాణ వ్యాహృత్యుపాసన : 
భూః అనగా ప్రాణ వాయువు, భువః అనగా అపాన వాయువు, సువః అనగా వ్యానవాయువు, మహః అనగా అన్నము. ఈ 4 వ్యాహృతులను 4 ప్రాణములుగా ఉపాసన చేయవలెను.
          ఈ నాలుగు వ్యాహృతులలో నాలుగేసి కల్పిత వ్యాహృతులను భావనచేయగా అవన్నీ కలిపి షోడశ వ్యాహృతిరూప బ్రహ్మయగును. ఈ బ్రహ్మమే షోడశ కళాపురుషుడు అనబడును. ఈ పద్ధతిలో చేసే ఉపాసనను విరాట్‌ బ్రహ్మోపాసన అందురు.

హిరణ్యగర్భ పాంక్తోపాసన : 
పరస్పర సంబంధముగల ఐదేసి విషయములతో కూడిన వర్గమును పాంక్తము అందురు. ఇవి ఇక్కడ మూడు పాంక్తములుగా వర్గీకరించబడినవి. ఒక్కొక్క పాంక్తమును ఉపాసించుచూ పోగా, చివరకు హిరణ్య గర్భునిలో ఐక్యము నొందును.

1. అధిభూత పాంక్తము  : దీనిలో 3 పాంక్తములు కలవు.

లోక పాంక్తము : 
భూమి, అంతరిక్షము, ద్యులోకము, దిక్కులు, ఈశానాది కోణములు - ఈ ఐదూ కలిసి లోక పాంక్తము

భూత పాంక్తము : 
జలము, ఓషధులు, వృక్షములు, ఆకాశము, విరాట్‌ పురుషుడు - ఈ ఐదూ కలిసి భూత పాంక్తము

దేవతా పాంక్తము : 
అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు - ఈ ఐదు కలిసి దేవతా పాంక్తము

2. ఆధ్యాత్మిక పాంక్తము : దీనిలో 3 పాంక్తములు కలవు.

వాయు పాంక్తము : 
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు - ఈ ఐదూ కలిసి వాయు పాంక్తము

ఇంద్రియ పాంక్తము : 
చక్షువు, శ్రోత్రము, మనస్సు, వాక్కు, సర్వేంద్రియములు అను ఐదు కలిసి ఇంద్రియ పాంక్తము

ధాతు పాంక్తము : 
చర్మము, మాంసము, నరములు, ఎముకలు, క్రొవ్వు, ఈ ఐదు కలిసి ధాతు పాంక్తము

3. బ్రహ్మ పాంక్తము, వైదిక పాంక్తము, యజ్ఞ పాంక్తము : 
ఈ మూడూ కలిసి హిరణ్య గర్భుడయ్యెను.
         ఈ కల్పిత పాంక్తములు మూడింటిని ఉపాసించి, ముందుగా జగత్తును ఒక్కటిగా చేసి, పిదప జగత్తును హిరణ్య గర్భునిలోనికి చేర్చి, ఐక్యత చెందవలెను. ఉపాసకుడు హిరణ్య గర్భునితో అనుసంధానము చేసుకొనుటను హిరణ్య గర్భ పాంక్తోపాసన అందురు.

నాలుగు మహా వాక్యార్థయుత విరాట్‌ పురుషోపాసన :

1. ప్రజ్ఞానం బ్రహ్మ వాక్యార్థము : 
పరబ్రహ్మ స్వరూపమగు నేను అనే తత్త్వము నుండియే సకల జగత్తు పుట్టుచున్నది. ఆ నేను యందే సర్వము ప్రతిష్ఠింపబడి యున్నది. నేను యందే చలించుచున్నది. నేను యందే లీనమై ప్రలయము పొందుచున్నది. ఆ విధముగా త్రిమూర్త్యాత్మకుడగు నేను యందు సృష్టి స్థితి లయములు కలుగుచున్నవి అని ఉపాసించవలెను.

2. అహంబ్రహ్మాస్మీ వాక్యార్థము : 
సహస్ర శీర్ష పురుషుడను నేనే, పురాణ పురుషుడను నేనే. నేను అణువు కంటే చిన్నగా ఉండి, విశ్వముకంటె పెద్దగాను ఉండుట అద్భుతము. హిరణ్మయ రూపుడను నేనే కదా! హరిని నేనే. హరుడను నేనే - అని ఉపాసించవలెను.

3. తత్త్వమసి వాక్యార్థము : 
అవస్థాత్రయమందు ఏ ప్రపంచము గోచరించు చున్నదో అది నేనేకదా! అది నాకంటె అన్యము కాదు కదా! నేను తప్ప రెండవది లేనప్పుడు నాకు కర్మ బంధము లేదుకదా! నేను సదా ముక్తుడను అయ్యే ఉన్నాను కదా! అని ఉపాసించవలెను.

4. అయమాత్మా బ్రహ్మ వాక్యార్థము: 
శరీరత్రయ స్థానములందు అనుభవింపబడునది నేను కాదు. అనుభవించువాడను  నేను కాదు. నేను నిర్వికల్పుడను, నిర్వికారుడను, నేను సర్వమునకు విల్షణుడను. కేవల చిన్మాత్రుడను. నేను సదా శివుడను. స్వస్వరూపము తప్ప ఇంక ఏమీ లేదు. స్వస్వరూపమే, స్వస్వరూపమే - అని ఉపాసించవలెను.
          మొదటి రెండు వాక్యార్థములలో తాను త్రిమూర్త్యాత్మకుడని, హిరణ్మయ స్వరూపుడని ఉపాసించి, మూడవ వాక్యార్థములలో లక్ష్యమైన పరబ్రహ్మను ఉపాసించుచు, త్వంపదార్థ దోషములు తనకు లేవనుచు ఉపాసించగా, నాల్గవ వాక్యార్థములో స్వస్వరూప నిర్ణయమును గావించు కొనుచున్నాడు. ఉపాసనా ఫలితముగా స్వస్వరూప సాక్షాత్కారము నొందుచున్నాడు.

అభ్యాసము : 
గురుదేవుల వలన తాను వినిన బ్రహ్మ లక్షణములను యుక్తిచే పర్యాలోచన చేయుట, ఇంకొకరికి వివరించుట, ఒకరికొకరు బోధించు కొనుట - ఈ మూడింటి వలన సందేహములు తీరిపోయి, విన్నవి విన్నట్లే చెప్పుచూ, చెప్పినవి చెప్పినట్లే నిశ్చయమై, అది నిది ధ్యాసగా నిలిచి యుండు వరకు చేయునది అభ్యాసము అనబడును.

జ్ఞానాభ్యాసము : 
ఇది జగత్తు, ఇది నేను అనేవి సృష్టి ఆదినుండియే ఉన్నవి. సృష్టికి పూర్వము జగత్తు, నేను అనేవి లేవు. ప్రలయానంతరము ఉండవు. అందువలన త్రికాలములందున్న పరమాత్మను లక్ష్యముగా చేసుకొని ముందుగా జగత్తును తొలగించుకొని, జగత్తుతో కలిసిపోయిన నేను మిగిలిపోగా ఆ నేనును కూడా తొలగించుకొనుటకు చేసే అభ్యాసము జ్ఞానాభ్యాసమనబడును. (1) జగత్తు మిథ్య (2) అంతఃకరణోపాధి విశిష్ఠ  చైతన్యము అయినట్టి జీవుడు, లేక చిదాభాసుడు, లేక నేను ఛాయా పురుషుడు మాత్రమే - అనియు, అందువలన ప్రపంచము, జీవుడు - రెండూ లేనివేనని అవి నిజ అస్తిత్వము కలిగినవి కావని మాటిమాటికి తనయందు అనుసంధానించు కొనుట మరియు బ్రహ్మమునందే సదా బుద్ధిని చేర్చి యుండుటయే జ్ఞానాభ్యాసము.

తత్త్వ జ్ఞానాభ్యాసము : 
ఇతర యోగాభ్యాసములకు బదులుగా ముందుగానే తత్త్వ జ్ఞానాభ్యాసము చేయుట కష్టతరమగును. అయినను ఏదో ఒక ఉపాయముతో అద్వితీయ బ్రహ్మతత్త్వమును మాటిమాటికి స్మరించుచూ ఉండుటయే తత్త్వజ్ఞానాభ్యాసము.

బ్రహ్మాభ్యాసము : 

(1) మహత్తత్వముచే సుందరమైనది, వైరాగ్య పర్యవసానమైనది, ఆనంద వర్షిణి అయినది. ఈ మూడూ ఆకారముగా చేసికొన్న మనస్సు కలవాడు బ్రహ్మాభ్యాసకుడు.

(2) ప్రమాణమునందలి సత్యత్వమును నిశ్చయించుటకు అనుకూలమైనది, ప్రమేయము యొక్క యధార్థమును నిశ్చయించునది బ్రహ్మాభ్యాసమనబడును.

(3) యుక్తిచేత, వేదాంత శ్రవణము చేత దృశ్య పదార్థము బొత్తిగా లేనిదేనను నిశ్చయ జ్ఞానము కొఱకు ప్రయత్నించుట బ్రహ్మాభ్యాస మనబడును. ఈ మూడూ బ్రహ్మాభ్యాసమునకు అంగములు.

బ్రహ్మాభ్యాస ఫలము : 
త్రికాలాబాధ్యమైన ద్రష్టయందు ఏ కాలమందును దృశ్యము తోచనే తోచదు - అనే నిశ్చయ జ్ఞానము కలుగును. దాని వలన రాగాదులు నశించును. అప్పుడు లక్ష్యమునకు సంబంధించిన జ్ఞానవాసన ఏర్పడి, వృద్ధి యగును. జ్ఞానవాసనా బలముచే లక్ష్యస్థితిని మననము చేయగా బ్రహ్మానందానుభవము అభివ్యక్తమగును. అంతవరకు జరిపే బ్రహ్మాభ్యాసము యొక్క ఫలము అపరోక్షసిద్ధి.

మనోనాశ్‌ అభ్యాసము : 
జ్ఞాతయగు జీవుడు, జడమగు దేహము, ఇంద్రియములు, ప్రపంచము ఇవన్నీ బొత్తిగా లేనే లేవని ఏ ప్రకారము నిర్ణయమో, అదే ప్రకారము యోగాభ్యాసము చేతను, శాస్త్రార్థము చేతను మాటిమాటికి స్మరించుచుండుటను మనోనాశ్‌ అభ్యాసమనబడును.

వాసనాక్షయాభ్యాసము : 
దృశ్యమగు ప్రపంచమంతయు వాస్తవము కాదు. అది యత్‌భావం తత్‌ భవతి గా భావనామాత్ర అస్తిత్వము కలదియే గాని సత్యము కాదు. అది ఒకప్పుడు కూడా సుఖకరమైనది కాదు. ఎప్పుడైనా సుఖకరమైనను, అది అనిత్యము, పైగా మిథ్య, క్షరము అని దృఢముగా నిశ్చయించుకొని, అట్టి నిశ్చయ జ్ఞానముచేత దృశ్య విషయముల వలన కలుగుచున్న రాగాదులు, బాధలు, మేలు కీడులు, ఇష్టాయిష్టములు, సకల ద్వంద్వములను అంతకంతకు తగ్గించుకొనుచూ చేసే సాధనను వాసనా క్షయాభ్యాసము అందురు.

వాసనలు - ప్రాణ స్పందన పరస్పర కారణములు : 
వాసనలున్నప్పుడు ప్రాణ చలనము కలిగి ప్రారబ్ధము అనుభవములోనికి వచ్చును. ప్రాణ స్పందన కారణముగా వాసనలు వృత్తి రూపమగును. వాసనలు, ప్రాణ స్పందన పరస్పర కారణములు. అందువలన ఏదో ఒకటి చేసి రెండవ దానిని సాధించవలెను. అనగా వాసనాక్షయాభ్యాసము చేత ప్రాణక్రియా యోగ సాధన గాని, ప్రాణక్రియా యోగాభ్యాసము చేత వాసనా క్షయమును గాని సాధించవలెను. ఈ రెండూ కలిసి చిత్తమును పోషించుచున్నవి. కనుక చిత్తలయము కొఱకు ఏది ముందుగా చేయవలెను ?
          ముందుగా ప్రాణస్పందన ఆగుటకు ప్రాణాయామము చేయగా వాసనల ప్రవర్తన నిదానించుచూ క్రమముగా వాసనాక్షయమగును. వాసనాక్షయాభ్యాసము చేయగా ప్రాణస్పందము నెమ్మదించి చివరకు ఆగిపోవును. కావున ఈ రెండు సాధనలను విడివిడిగా గాని, సమాంతరముగా గాని, సాధకుల సామర్ధ్యమును బట్టి జరుపవలెను. ఈ విధముగా చిత్తమును నిరోధించవలెను. కట్టెలు కాలిపోవుచుండగా క్రొత్తవి చేర్చక, ఉన్నవి క్రమముగా కాలిపోగా, చివరకు అగ్నికూడా స్వయముగా దాని స్వకారణమైన వాయువులో లయమగును. అదే విధముగా వృత్తులు నశించగా చిత్తము స్వకారణమైన పరమాత్మలో లయమగును.
          వాసనలతో కూడిన చైతన్యమే చిత్తమగును. వాసనాక్షయమైన చిత్తమే చిత్‌ స్వరూపమగును. శబ్దాది విషయములు వాస్తవమనియు, సుఖ రూపమనియు, హృదయమందు భావన కలిగిన, చిత్తము పుట్టును. ఆ విషయములు మిథ్య యనియు, బంధ హేతువులనియు గ్రహించి, ముందటి భావమును విడచిపెట్టి అభావ రూపమగుట వలన చిత్తము లయమగును. చిత్త లయము, చిత్త క్షయము, చిత్త నాశనము, చిత్త వృత్తి నిరోధము, చిత్త శాంతి, అమనస్కము, మనోనాశ్‌ ఇవన్నీ పర్యాయ పదములు. చిత్తమందు సర్వాధికమైన శాంతి లభించుట అనగా పరమ శాంతి, పరమాత్మ సాక్షాత్కారము అని అర్థము.
          ప్రాణస్పందము మనస్పందమునకు, మనస్పందనము ప్రాణస్సందమునకు ఒకదానికొకటి పరస్పర కారణము. బ్రహ్మ ధ్యానాభ్యాసము వలన విద్యామదము మొదలగు మలిన వాసనలు గలవారికి బ్రహ్మ ధ్యానమునకు విఘ్నములు కలుగును. అట్టివారు ప్రాణాయామము ద్వారా ప్రాణ స్పందనను నిలిపి వేసినచో, మనస్పందన దాని అంతట అదే ఆగిపోవును. ఈ పరాస్పరాధార, పరస్పర కారణములను ఏ విధముగా ఉపయోగించుకొనవలెనో, అదియే యుక్తి. వాసనాబలము తగ్గిన వారికి, నేరుగా బ్రహ్మ ధ్యానాభ్యాసము సుకరము. వాసనలు బలమైయున్నచో, ప్రాణాయామాభ్యాసము తప్పనిసరి.

వాసనాక్షయము- మనోనాశము - తత్త్వజ్ఞానము లతో జీవన్ముక్తి ప్రకాశము: వాసనాక్షయము, మనోనాశము, తత్త్వ జ్ఞానము ఈ మూడూ సమాంతరముగా మాటిమాటికి చక్కగా, చిరకాలము అభ్యాసించవలెను. అప్పుడే గాని అవిద్యా కామ కర్మ వాసనలు అన్నీ నిశ్శేషముగా నశించవు. సమాంతర మెందుకనగా, అవన్నీ పరస్పర కారణము గనుక. ఒకటి ముందు ఒకటి వెనుక అభ్యసించినచో ఒకటి మరొక దానికి విఘ్నము  కలిగించును. ఎట్లనగా -
         ఎంతవరకు మనస్సు నశించదో, అంతవరకు వాసనా క్షయము కాదు. ఎంతవరకు వాసనలు నశించవో, అంతవరకు వాటికి ఆలవామైన మనస్సు నశించదు. వాసనాక్షయ, మనోనాశములు పరాస్పర కారణములు. అభ్యాసములు ఆ రెండింటికి వేరు వేరుగా నున్నందున ఆ రెండు సాధనాభ్యాసములు సమాంతరముగా చేయవలెను.
         అలాగే ఎంతవరకు తత్త్వజ్ఞానము కలుగదో, అంతవరకు మనోనాశము జరుగదు. ఎంతవరకు మనోనాశము జరుగదో, అంతవరకు తత్త్వజ్ఞానము పట్టుబడదు. అందువలన ఈ రెండు సాధనలను ఏక కాలమందే చేయుచుండవలెను. ఒకదాని వృద్ధి రెండవ దానికి ఫలితమును క్రమక్రమముగా అందించును. రెండునూ మరొక దాని వృద్ధి వలన హెచ్చుచూ, హెచ్చుచూ, చివరకు పూర్తి ఫలితము సిద్ధించును.
          ఎంతవరకు వాసనా క్షయము కాదో, అంతవరకు తత్త్వజ్ఞానము కలిగినను, నిలబడదు. ఎంతవరకు తత్త్వజ్ఞానము నిలబడదో, అంతవరకు వాసనలు శేషించుచుండును. సమకాలములో రెండింటినీ అభ్యాసము చేయుచుండగా పరస్పర సహకారము వలన రెండునూ ఫలించును.
         వాసనల వలన ఏర్పడిన వృత్తులన్నీ నశించినచో తత్త్వజ్ఞానమును సముపార్జించుకొనబడును. అందువలన బ్రహ్మాకార వృత్తితో సహా సర్వవృత్తులూ నశించును. కారణమేమనగా, సాక్షాత్కారమైన వస్తువు అద్వైతము గనుక, అది స్వయముగా ఇతరమును ఉండనీయదు, అనగా సర్వ వృత్తులు నశించును. ఇకముందు పుట్టబోవు.
         ఈ విధముగా ఈ మూడూ పరస్పర కారణములైనందున ఆయా అభ్యాసములను ఏకకాలమందు చేయుచూ ఏదో ఒక దానియొక్క వృద్ధి చేత మిగిలిన వాటిని కూడా క్రమముగా వృద్ధి చేసుకొనవచ్చును. ఈ మూడింటికీ తగిన ఇతర సాధనలను, ఉపాసనలను, అభ్యాసములను అనుబంధముగా చేసుకొనుచూ శ్రవణాదులను యుక్తిగా, శ్రద్ధగా జరుపు కొనుచూ కడదేరినవారే జీవన్ముక్తులు.
         వాసనాక్షయము, మనోనాశము, తత్త్వజ్ఞాన సముపార్జన మరియు తత్త్వానుసంధానము అను వాటిని యుక్తిగా అభ్యసించుచూ పూర్ణము గావించుకొన్నదే జీవన్ముక్తి ప్రకాశము.

ముక్తికాంత :

కం||  గంగాయమునలు రెండును - సంగంబైయున్న చోట |
       సన్నపుకంతన్‌ బంగారు యువతి | బొందిన శృంగారుడ 
       పరశురామ సీతారామ ||

ఆత్మైక్యము :

కం||  నీవార శూక శిఖరము | భావించిన సూక్ష్మమధ్య |
       పరమాత్మైక్యం జీవుని జేసినవారలు | సేవింతురు
       పరశురామ సీతారామ ||

శ్రు||  శీర్షోపరి ద్వాదంశాంగుల
       మానజ్యోతిః పశ్యతి, తదా అమృతత్వమేతి||

తా||    శిరస్సుపై (బ్రహ్మ రంధ్రముపై) 12 అంగుళములకు పైన జ్యోతి స్సమూహము కనుపించినచో అమృతత్వము సిద్ధించుచున్నది.

శ్రు||  ఆత్మన్వేప స్థితోయస్తు సయాతి పరమాంగతిమ్‌
- నారద పరివ్రాజకోపనిషత్‌

తా||    పరబ్రహ్మమునందే రమించుచు, స్థితుడై యుండు జ్ఞాని పరమపదము నొందుచున్నాడు.

          ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే |
       పూర్ణస్యపూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే ||

                   ఓం శాంతిః శాంతిః శాంతిః